యెస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల నుంచి బయటకు వచ్చి జాతీయ బ్యాంకుల బాట పట్టాలని తమ ప్రభుత్వ సంస్థలకు మహారాష్ట్ర సర్కార్ తాజా ఆదేశాలిచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగం సంస్థలు, కార్పొరేషన్లు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ ఇక జాతీయ బ్యాంకులతోనే కలిసి పనిచేసేలా చూసుకోవాలని ప్రభుత్వం తీర్మానించినట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రైవేటు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో తెరిచిన అకౌంట్లన్నీ ఏప్రిల్ 1వ తేదీ నాటికి మూసేయాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. 11 జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు ఇతర ప్రభుత్వ బ్యాంకుల నుంచి మాత్రమే చెల్లించేలా చూసుకోవాలని కూడా అధికారులను ఆదేశించింది. పెన్షనర్లు తమ అకౌంట్లను నేషనలైజ్డ్ బ్యాంకులకు మార్చుకోవాలని కూడా సూచించింది.

ఇదిలా ఉంటే ప్రైవేటు బ్యాంకులపై అనవసర ఆందోళనలు వద్దని, ప్రైవేటు బ్యాంకుల్లోని ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వాలు బదలాయించవద్దని ఆర్‌బీఐ గత గురువారం ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు విజ్ఞప్తి చేసినప్పటికీ మహారాష్ట్ర సర్కార్ ఈ సూచనలను బేఖాతరు చేసింది.