నటుడిగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు. బాలీవుడ్‌లోని కొన్ని దుష్ట శక్తులు సుశాంత్‌ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్టు ప్రముఖ నటి కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ ఎంతో టాలెంట్ ఉన్న యాక్టర్.‘కైపోచే’ సినిమాకు బెస్ట్ న్యూ యాక్టర్‌గా అవార్డు రావాల్సింది. కానీ అతనికి అవార్డు రాకుండా కొందరు పెద్దలు వెనక పెద్ద కుట్ర చేసారన్నారు. ఇక గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘చిచ్చోరే’ వంటి అద్భుతమైన సందేశం ఉన్న చిత్రానికి ఎలాంటి అవార్డు కూడా ఇవ్వలేదు. కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ పొందిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడు అంటూ కంగనా వ్యాఖ్యలు చేసింది. కంగనా రనౌత్ తన ట్విట్టర్‌లో సుమారు రెండు నిమిషాలున్న ఓ వీడియోలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం వెనక కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నట్టు చెప్పి సంచలనం రేపింది. ఆయనకు సరైన అవకాశాలు రాకుండా వీళ్లే అతన్నిఅడ్డుకున్నారు. అంతేకాదు అతనికి వచ్చే అవకాశాలను కూడా రాకుండా చేశారని ఆరోపణలు గుప్పించింది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించరు. ఎవరైనా పైకి వస్తుంటే.. తెర వెనక కుట్రలు పన్నడం వారికి అలవాటే. కొత్తగా ఎవరైనా వచ్చి సక్సెస్ అవుతున్నారని తెలిస్తే చాలు.. వారి సినిమాలకు చెత్త రివ్యూస్ ఇస్తుంటారు. సుశాంత్ విషయానికొస్తే.. అతనో డ్రగ్స్‌కు బానిస అని ప్రొజెక్ట్ చేయడానికి కొందరు ప్రయత్నించారు. తన సినిమాలు ఆడకపోతే.. తనని ఇండస్ట్రీలో ఉండనీయరని ఒకానొక సందర్భంలో సుశాంత్ తన సినిమాలు చూడండి అంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసిన సందర్భాలున్నాయి. ఇక బాలీవుడ్‌లో సంజయ్ దత్ వంటి వాళ్లు అక్రమ ఆయుధాలు కలిగియున్నాడనే కారణంగా అరెస్ట్ అయ్యాడు. అంతేకాదు జైలు శిక్ష అనుభవించాడు. అంతేకాదు అతను డ్రగ్స్‌కు బానిస అయిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా కృష్ణ జింకలను వేటాడిని కేసులతో పాటు ఫుట్‌పాత్ పై పడుకున్న కొంత మంది మృతికి కారణమైన విషయాలను కంగనా ఈ సందర్భంగా గుర్తు చేసింది. వీళ్లందరు ఉత్తములు. కానీ సుశాంత్ మాత్రం డ్రగ్స్‌కు బానిసైన విషయాన్ని కొన్ని పత్రికలు పనిగట్టుకొని రాయడాన్ని తప్పు పట్టారు.