ఉత్తరప్రదేశ్… కాన్పూర్‌లో ఓ కోతిని జూ అధికారులు జైలు లాంటి బోనులో బంధించారు. దానికి జీవిత ఖైదు విధించారు. ఇలా ఎక్కడా జరిగి ఉండదేమో. అక్కడ జిరిగింది. ఆ కోతి ఇప్పటికీ బంధీగానే ఉంది. దాన్ని బంధించడం వెనక పెద్ద కథే ఉంది. ఆరేళ్ల కిందట మిర్జాపూర్ జిల్లాలో పుట్టింది కల్వా. దాన్ని పెంచుకుంటూ ఓ వ్యక్తి దానికి మద్యం అలవాటు చేశాడు. దాంతో కోతికి మద్యం బాగా అలవాటై… బానిసగా మారింది. అతను ఎప్పుడు మద్యం తెచ్చుకున్నా… పక్కనే వచ్చి కూర్చొని… తనకెప్పుడు సోడా కలిపి ఇస్తాడా అని ఎదురుచూసేది. అతను సోడా కలిపి ఇవ్వడమే కాదు… మంచి కోసం… చిరుతిళ్లు కూడా ఇచ్చేవాడు. అలా మద్యం గుటకలు వేస్తూ… చిరుతిళ్లు తింటూ… మనుషులు అదృష్టవంతులు. మా కోతులకే మద్యం దొరకదు అనుకునేది. ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా అతను తన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ… కోతి ఆరోగ్యానికీ హాని చేయసాగాడు. ఓ రోజు అతను అనారోగ్యంతో చనిపోయాడు. అంతే… ఆ కోతిని చూసుకునేవాళ్లు లేకుండా పోయారు.

ఒక్కసారిగా మద్యం లేకపోయేసరికి ఆ కోతికి తిక్కరేగింది. కోపం పెరిగింది. ఆవేశంతో రగిలిపోయింది. ఎవరు కనిపిస్తే వాళ్లపై దూకి… దాడి చేయడం, కొరకడం మొదలుపెట్టింది. అది అసలే పెద్ద కోతి కావడంతో… దాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. మీర్జాపూర్ మొత్తం కలకలం రేగింది. బాబోయ్ కోతి… అంటూ జనం హడలెత్తిపోయారు. విషయం జూ అధికారులకు తెలిసింది. కోతిని పట్టుకుందామని చూశారు. వాళ్లకూ చుక్కలు చూపించింది. మద్యానికి అది ఎంతలా బానిసైందో కళ్లారా చూశారు. కొన్ని ప్రయత్నాల తర్వాత మొత్తానికి దాన్ని పట్టుకున్నారు. కానీ అప్పటికే ఆ కోతి 250 మందిని కరిచింది. వాళ్లలో ఒకరు తాజాగా చనిపోయారు.
కోతిని పట్టుకున్నాక… కొన్నాళ్లు ప్రత్యేక బోనులో ఉంచారు. దాని ప్రవర్తనలో మార్పు వచ్చే ఉంటుందనుకొని… దాన్ని బయటకు తీసి… మిగతా కోతులతో ఉంచి చూశారు. కల్వా మారలేదు. అదే కర్కశం… అదే కోపం, అదే ఆవేశం. ఓర్నాయనో ఇదేం కోతిరా బాబూ… అనుకుంటూ… దాన్ని మళ్లీ సింగిల్ బోనులో బంధించారు. మూడేళ్లుగా అది అలాగే ఉంది. దాన్ని జీవితకాలం అలాగే ఉంచుతామని తెలిపారు జూ డైరెక్టర్ మొహ్మద్ నాజిర్. కోతిని వదిలేస్తే… అది మళ్లీ కరవడం ఖాయమని జూ డాక్టర్ తెలిపారు. మూడేళ్లుగా దానికి ఆహారం పెడుతున్న జూ కీపర్‌కి కూడా అది ఇంకా మచ్చిక కాలేదనీ… ఇక అది మారదని వివరించారు. అందుకే అంటారు… కల్లు తాగిన కోతి కుదురుగా ఉండదని. ఒక్క వ్యక్తి చేసిన మద్యం అలవాటు వల్ల ఇప్పుడా కోతి జైలుపాలైనట్లైంది.