గ్రామాలను చుట్టుముట్టిన కృష్ణమ్మ.

0
60

కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే మట్టపల్లి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం దాదాపుగా మునిగిపోయింది. కృష్ణానది దిగువ ప్రాం తాలైన దామరచర్ల, సాగర్‌ తిరుమలగిరి, అడవిదేవులపల్లి మండలాల పరిధిలో పంటపొలాల్లోకి నీరు చేరుతోంది. దామరచర్ల మండలంలో కృష్ణమ్మ ఉగ్ర రూపం మూసీ నదివరకు తాకింది. శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్ల, సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యంపహా డ్‌ల మధ్య ఉన్న మూసీ నదిబ్రిడ్జిపైనుంచి కృష్ణమ్మ ప్రవహిస్తోంది. 2009లో వంతెనపైనుంచి వరద వెళ్లగా, పదేళ్ల తర్వాత మళ్లీ ఆ దృశ్యం ఆవిష్కృతమైంది.

మఠంపల్లి, చింతలపాలెం, పాలకవీడు మండలాల్లో కొన్ని గ్రామాలను కృష్ణమ్మ చుట్టుముట్టింది.  ఎటుచూసినా వరదే కన్పించింది. మట్టపల్లి శ్రీలక్ష్మీనసింహస్వామి ఆలయంలోకి నీరుచేరింది. పులిచింతల స్టోరేజీ 40 టీఎంసీలు దాటడంతో బ్యాక్‌వాటర్‌ పెరిగి కరకట్ట లీకేజీలు అధికమయ్యాయి. గర్భాలయంలోకి నడుములోతు నీరుచేరి స్వామి మూలవిరాట్‌ పాదాలను తాకాయి. శివాలయం, అన్నదాన సత్రాలు, అతిథి గృహాలు మట్టపల్లి గ్రామంలోని ఇళ్లు, వీధులు జలమయమయ్యాయి. మధ్యాహ్న సమయంలో గర్భాలయంలో స్వామివారికి నివేదన గావిం చారు. నిత్యపూజలను పైభాగంలోని చెన్నై పీఠంలో నిర్వహించారు.  పులిచింతల ప్రాజెక్ట్‌ దిగువన ఉన్న వజినేపల్లి, బుగ్గమాదారం, ఎగువనపాలకవీడు మండలం రావిపహడ్, గుండెబోయినగూడెం, మహంకాళిగూడెం లలో వరి, పత్తి, మిర్చి, అరటి తో టలు నీట మునిగాయి. శూన్యంపహాడ్‌ – దామరచర్ల మధ్య మూసీపై నిర్మించిన బ్రిడ్జిపైకి నీరు చేరి రాకపోకలు బంద్‌ అయ్యాయి.