మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగింది. రేపే మహారాష్ట్ర బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలపరీక్ష నిరూపించుకోవాలని ఆదేశించింది. ఆ ఓటింగ్ రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం లేదని, లైవ్ కవరేజీ ద్వారా నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. వాస్తవానికి గవర్నర్ ఈ నెల 30 వరకు ఫడ్నవీస్ ప్రభుత్వానికి గడువు ఇచ్చారు. అయితే.. సుప్రీం కోర్టు మాత్రం రేపే బలపరీక్షకు ఆదేశించడం గమనార్హం. కాగా, 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన 56 సీట్లు గెలిచింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. బీజేపీకి 11 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉంది. ఇంకా 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంత మంది అజిత్ పవార్ వర్గం నుంచి వస్తారా అన్నది తేలాల్సిన అంశం. అటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 144 మంది సభ్యుల బలం ఉంది. కొందరు ఇండిపెండెంట్లు కూడా ఎన్సీపీకి సపోర్ట్ ఇస్తున్నారు. అందువల్ల ఆ కూటమి ప్రభుత్వం గట్టెక్కే ఛాన్స్ ఉంటుంది. కానీ… ఎన్సీపీలో రెబెల్స్ అందుకు సపోర్ట్ చేస్తారా అన్నది శరద్ పవార్‌ను వెంటాడుతున్న భయం.