ఆయన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు.. ప్రభుత్వ అధికారులు, సీఎం, మంత్రులు ఆయన తర్వాతే.. కానీ, అసెంబ్లీ వేదికగా ఆయనకు దారుణ అవమానం జరిగింది. శాసనసభలోకి రాకుండా గేటుకు తాళం వేసి అవమానించారు సిబ్బంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఈ రోజు పశ్చిమ బెంగాల్ స్పీకర్ గవర్నర్‌ను మీటింగ్‌కు ఆహ్వానించారు. అయితే, గవర్నర్ జగదీప్ ధన్‌కర్ అసెంబ్లీ గేటు నంబరు 3 నుంచి లోపలికి వెళ్లేందుకు రెడీ కాగా, అక్కడున్న సిబ్బంది అప్పటికే గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో గవర్నర్ తీవ్ర అసహనానికి లోనయ్యారు.
తనను అసెంబ్లీలోకి రానీయకుండా గేటుకు తాళం వేశారని చెప్పారు. స్పీకర్ మీటింగ్ అని పిలిచి, చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.కాగా, పలు బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇవ్వాల్సి ఉండగా, ఆయన ఆలస్యం చేస్తున్నారని మమతా ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి నిరసనగానే ఆమె ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.