
సోషల్ మీడియాలో తనకు ఎవరూ తిరుగులేరని చాటుకుంటున్నారు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా. నాలుగు మాసాల వ్యవధిలోనే ఆయన ఇన్‌స్టాగ్రమ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. 2019 అక్టోబర్ మాసంలో ఆయన ఇన్‌స్టాలో అకౌంట్ ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో 10 లక్షల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని టాప్ సెలబ్రిటీలను మించిపోయారు రతన్ టాటా. 10 లక్షల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న సందర్భంగా తాను నేలపై కూర్చుకున్న ఫోటోను ఇన్‌స్టాలో రతన్ టాటా షేర్ చేశారు. తన ఫాలోవర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇన్‌స్టాలో చేరినప్పుడు తాను ఈ మైలురాయిని చేరుకుంటానని ఊహించలేదన్నారు. ఇంటర్నెట్ యుగంలో విలువైన బంధాలు అన్ని అంకెలకంటే గొప్పదని వ్యాఖ్యానించారు. తాను పెంపుడు జంతువులతో కాలక్షేపం చేస్తున్న ఫోటోలు, స్ఫూర్తిదాయకమైన సందేశాలు, తన పాత ఫోటోలను రతన్ టాటా ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు.

రతన్ టాటా నేలపై కూర్చుకున్న ఈ ఫోటోకు 24 గం.ల వ్యవధిలోనే 4.75 లక్షల మంది ఫాలోవర్స్ లైక్స్ కొట్టారు. ఆయన సింప్లిసిటీ అందరికీ ఆదర్శమంటూ కొనియాడారు. నేటి యువతకు ఆయన స్ఫూర్తి ప్రధాతగా కొందరు నెటిజన్స్ ప్రశంసించారు.