పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన అమెరికా

0
195

జమ్ముకశ్మీర్‌లో పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల పై దాడికి పాల్పడ్డారు. ఐఈడీతో ఆత్మాహుతి దాడికి తెగబడటంతో దాదాపు 44 మంది జవాన్లు అమరులయ్యారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.

దాడికి పాల్పడింది తామేనని ప్రకటించింది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్. ఇప్పటివరకు కశ్మీర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇదే అతిపెద్దది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2016లో యురి సైనికస్థావరంపై దాడి చేసి 18 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న ముష్కరులు ఆ తర్వాత జరిపిన అతిపెద్ద దాడి ఇదే. జమ్ము నుంచి పుల్వామాకు 78 వాహనాలతో సీఆర్ఫీఎఫ్ జవాన్లు వెళుతుండగా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ వాహనాల్లో సుమారు 25వందల మంది  జవాన్లు ఉన్నట్లు సమాచారం.

ఈ కాన్వాయ్‌లో పలు బస్సులు, ట్రక్కులు, ఎస్‌యూవీలు సహా మొత్తం 78 వాహనాలున్నాయి. ఒక్కో బస్సు లేదా ట్రక్కులో 35 నుంచి 40 మంది చొప్పున మొత్తం 2,547 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సెలవు నుంచి తిరిగివచ్చి విధుల్లో చేరేందుకు వెళ్తున్నవారే. సాధారణంగా ఒక కాన్వాయ్‌లో దాదాపు వెయ్యిమంది సిబ్బంది ఉంటారని, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆ రహదారిపై మూడ్రోజులుగా వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో సీఆర్పీఎఫ్కా న్వాయ్‌లో ఒకేసారి ఎక్కువమంది సిబ్బంది బయలుదేరారని అధికారులు చెప్పారు. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టే సాయుధ వాహనాల కాన్వాయ్‌లో ఉందని తెలిపారు. దాడిలో ధ్వంసమైన బస్సు సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందినది.

ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది. ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ కమాండో అనే ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడంటూ.. జేఈఎం అతని వీడియోను విడుదల చేసింది. ఆదిల్ దార్ రైఫిళ్లను చేతపట్టుకుని జేఈఎం బ్యానర్ల ముందు నిలబడిన దృశ్యం ఇందులో కనిపిస్తున్నది. పుల్వామా జిల్లా కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ అహ్మద్ దార్ గతేడాది జేఈఎంలో చేరినట్టు పోలీసులు గుర్తించారు. ఈ దాడిపై దర్యాప్తులో పాలుపంచుకునేందుకు ఉగ్రవాద వ్యతిరేక కమాండో దళం ఎన్‌ఎస్జీ నిపుణులతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులను
జమ్ము-కశ్మీర్‌‌కు చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరి దర్యాప్తు చేస్తున్నారు.

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పరిధిలో భారీ వాహనాలతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ బయలు దేరుతున్న సమాచారం ఉగ్రవాదులకు ముందే లీకై ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. భారీ స్థాయిలో బలగాలు కాన్వాయ్‌గా బయలుదేరుతున్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుందన్నారు. అటువంటి వారే ఉగ్రవాదులకు ఈ సమాచారం అందించి ఉంటారు అని ఒక భద్రతా దళం అధికారులు అనుమానిస్తున్నారు.భారీగా బయలుదేరిన కాన్వాయ్ విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా? ఏమైనా అవకతవకలు చోటు చేసుకున్నాయా? అనేది విచారణలో తేలుతుందన్నారు.

సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిని అమెరికా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్‌కు అండగా నిలుస్తామని స్పష్టంచేసింది. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపింది. ముష్కర మూకలపై పోరాడటంలో, ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్‌కు అమెరికా అండగా నిలుస్తుందన్నారు. ఇదే బాటలో ఫ్రాన్స్, రష్యా, నేపాల్ తో పాటు చాలా దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి.