స్వార్థ రాజకీయాల వల్లే కశ్మీర్ కల్లోలం గా ఉంటోంది

0
248

జై జవాన్ అంటూ.. ఇదిగో కశ్మీర్ లో లాంటి ఘటనలు జరిగినప్పుడు అనుకుంటాం. నీ త్యాగం వృథా కాదంటూ మీడియా, సోషల్ మీడియాల్లో కామెంట్స్ చేస్తాం. పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు పోయినప్పుడే యావత్ గొంతు ఒక్కటి అవుతుంది. పాక్ చర్యలని, ఉగ్రవాద పనులను అంతం చేస్తాం అంటూ రాజకీయ ప్రగల్బాలు పలుకుతారు. ఆ వేడి తగ్గక అన్నీ మర్చిపోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. అంతిమంగా ఎప్పుడూ జరిగేది ఒక్కటే ఈ దేశం కోసం సర్వం ఆర్పించే జవాన్నీ ఎవరూ గుర్తించారు. అమర్ రహే అంటూ అమరవీరుల దినోత్సవం రోజు ఓ పుష్ప గుచ్ఛం పెట్టి మమ అనిపిస్తాం.

మన దేశం లో రాజకీయాలు చేసే నాయకులు ఉన్నంతవరకు జవాన్లు ఇలా ప్రాణాలు కోల్పోవాల్సిందే ఎందుకింత ఆవేదన.. ఎందుకింత ఆవేశం అంటే పుల్వామా ఘటన చూసిన ఎవ్వరైనా సరే ఇలానే స్పందిస్తారు. ఆత్మహుతి దాడి దెబ్బకు CRPF జవాన్ల డెడ్ బాడీలు గుర్తు పట్టలేనివిధంగా పడివున్నాయి. మాసం ముద్దలు, రక్తంతో తడిసిన రోడ్డు, చెల్లా చెదురుగా పడివున్న ఆ మృతదేహాలు చూస్తే భయంతో పాటు కసి పెరుగుతుంది.

ఓ సామాన్యుడికి ఇలా ఉంటే ఇక ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆవేదన ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ దుస్థితి కి కారణం మన రాజకీయ నేతలు, ప్రభుత్వాలే. వీళ్ళ స్వార్థ రాజకీయాల వల్లే ప్రతీ రోజు కశ్మీర్ కల్లోలం గా ఉంటోంది. ప్రకృతి అందాలతో ప్రశాంతం గా ఉండాల్సిన కాశ్మీరం నరకాన్ని తలపిస్తోంది.

ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ ని పేల్చేసాడని అమెరికా ప్రభుతం అల్ ఖైదాని వెంటాడి మరీ చంపింది. శాంతి శాంతి అంటూ ప్రపంచ దేశాలు నీతి వచనాలు చెప్పిన మా బాధ మీకు అర్థం కాదంటూ ఉగ్రవాదులపై పోరాటం చేసింది. కోట్ల డాలర్లు ఖర్చు చేసి, లాడెన్ దొరికే వరకూ ఆఫ్ఘన్, పాక్ ఉగ్రవాద స్థావరాలను అణువణువు గాలించింది. లాడెన్ ని చంపి అనుకున్నది సాధించింది. అల్ ఖైదాని అంతం చేసింది. మన దేశం ఉంది. మన నాయకులూ వున్నారు. మన ప్రభుత్వాలూ ఉన్నాయి. పుల్వామా లాంటి ఘటనలు జరిగినప్పుడు పాక్ పనిపడతాం, ఉగ్రవాదులను ఏరేస్తాం అంటూ వీర లెవల్లో మాట్లాడతాం. కంటి తుడుపు చర్యగా సర్జికల్ స్ట్రిక్స్ చేసి ఏదో ఘనకార్యం చేసినట్టు కోతలు కోస్తారు. మా ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు ఇలా చేసింది అలా చేసింది అంటూ ఏ పార్టీకి ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడంతోనే సరిపోతుంది. కశ్మీర్ నిజంగానే ఓ పరిష్కారం లేని సమస్యనా? కాదు. ఇది సగటు భారతీయుడే కాదు యావత్ ప్రపంచ కానికి తెలుసు. కానీ ఇది ఏ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి, ఏ ప్రభుత్వానికి అవసరం లేదు. తలచుకుంటే అయిపోతుంది. కానీ ఆ దిశగా ఏ ప్రభుత్వాలూ చర్యలు తీసుకోవు. స్వార్థం ఉన్న రాజకీయాలు ఏ భారత దేశంలో ఉన్నంతవరకు పుల్వామా లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. నిత్యం కాశ్మీర్ రగులుతూనే ఉంటుంది. జవాన్ల ప్రాణాలు పోతూనే ఉంటాయి. మా కోసం, ఈ దేశం కోసం మీ ప్రాణాలు కోల్పోయిన, కోల్పోతున్న వీరులరా మమ్మల్ని క్షమించండి. చేతకాని, చేవలేని ఈ రాజకీయాలకు మిమ్మల్ని బలి ఇస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి.