భారత్ – పాక్ మ్యాచ్ జరుగుతుందా? ఐసీసీ ఏమంటోంది?

0
169

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్‌సన్ స్పందిస్తూ, ఇప్పటికైతే షెడ్యూల్‌లో ఎలాంటి మార్పుల్లేవని స్పష్టం చేశారు. యధావిధిగానే అన్ని మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పారు.

“మెగా ఈవెంట్‌లో మ్యాచ్‌లు రద్దు చేసుకుంటున్న సంకేతాలైతే మాకు లేవు. ఉగ్రదాడి జరుగడం దురదృష్టకరం. ఈ ఘటనలో మరణించిన జవాన్లకు సంతాపం తెలియజేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులను మా సభ్య దేశాల బోర్డులతో కలిసి సమీక్షిస్తున్నాం. క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్‌కు అందర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే సత్తా ఉంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే మేం సభ్య దేశాలతో చర్చలు జరుపుతున్నాం” అని రిచర్డ్‌సన్ వెల్లడించారు.

మరోవైపు, పుల్వామా సంఘటన తర్వాత యావత్ దేశం.. పాక్‌తో మ్యాచ్‌లు ఆడొద్దని ముక్తకంఠంతో వ్యాఖ్యానించింది. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ అయితే వరల్డ్‌ కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకున్నా.. కప్ గెలిచి సత్తా టీమ్‌ ఇండియాకు ఉందని కుండబద్దలుకొట్టాడు. ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా పాక్‌తో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని తేల్చడంతో ప్రపంచకప్ మ్యాచ్‌పై సందేహాలు మొదలయ్యాయి.