సీనియర్ జర్నలిస్టు కన్ను మూత.

0
94

సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన గురువారం సొంతింట్లోనే తుది శ్వాస విడిచారు. తెలుగు పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా పొత్తూరి విశేష సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పొత్తూరులో పొత్తూరి వెంకటేశ్వరరావు జన్మించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తి ప్రారంభించారు. తర్వాత ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ తదితర పత్రికల్లో పని చేశారు. అనేక పుస్తకాలు రాశారు. 2000 సంవత్సరంలో ఆయన రాసిన నాటి పత్రికల మేటి విలువలు పుస్తకం, 2001లో విడుదలైన చింతన, చిరస్మరణీయులు పుస్తకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.

పొత్తూరి వెంకటేశ్వరరావు చనిపోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన మరణం తీరని లోటని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జర్నలిజంలో ఆయన పితామహుడని కొనియాడారు. ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పొత్తూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ఏపీ మాజీ మంత్రి లోకేశ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పొత్తూరి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.